చనిపోయిన 40 ఏళ్లకు తిరిగొచ్చిందామె..!

కాన్పూర్: చనిపోయిన 40 ఏళ్లకు తిరగి వస్తే… ఇది వినడానికే వింతగా ఉంది కదూ. కానీ ఇది నిజంగా జరిగింది. చనిపోయి 40ఏళ్లు గడిచిన తర్వాత ఓ మహిళ తిరిగొచ్చి అందరినీ విస్మయానికి గురిచేసింది. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి… యుపిలోని కాన్పూర్ సమీపంలో గల ఓ గ్రామానికి చెందిన 82 ఏళ్ల విలాస అనే మహిళ పశువుల మెత కోసం అడవికి వెళ్లగా అక్కడ పాము కాటుకు గురైంది. దీంతో ఆమె కుటుంబీకులు నాటు వైద్యం చేయించారు.

కానీ ఫలితం లేకపోవడంతో చనిపోయిందని భావించి ఆమెను స్థానికంగా ఉన్న గంగా నదిలో పడేసి అంతిమ సంస్కారాలు కూడా నిర్వహించేశారు. అయితే ఆమెను నదిలో కొట్టుకుపోతుండగా గుర్తించిన మరో గ్రామానికి చెందిన జాలర్లు కాపాడి ఒడ్డుకు తీసుకువచ్చారు. అప్పటికే ఆమె స్పృహ కోల్పోయి ఉంది. దాంతో వైద్యం అందించి కాపాడారు. స్పృహలోకి వచ్చిన ఆమె తన గతం మర్చిపోయింది.

అయితే 40 ఏళ్ల తరువాత ఇటీవల ఆమెకు గతం గుర్తుకు వచ్చింది. దాంతో తన గతాన్ని ఓ బాలికకు చెప్పింది. ఆ బాలిక తన పెద్దవాళ్లకు చెప్పడంతో చుట్టూ పక్కల ప్రాంతాల్లో ఆరా తీశారు. ఈ క్రమంలో ఆమె కుమార్తెలను గుర్తించి వాళ్ల వద్దకు తీసుకెళ్లారు. కాగా, ఆమె శరీరంపై ఉన్న పుట్టుమచ్చల ఆధారంగా కుమార్తెలు ఆమెను గుర్తించారు. దీంతో చనిపోయిందనుకున్న తమ తల్లి 40 ఏళ్లు గడిచిన తర్వాత తిరిగిరావడంతో వారి ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.

Related Posts

About The Author

Add Comment